: 'ఒకటి కొంటే ఒకటి ఉచితం' అని ఆశపడ్డా పన్ను భారం పడుద్ది!


తమ ప్రొడక్టుల అమ్మకాలను పెంచుకోవడానికి, పాత స్టాక్ ను వదిలించుకోవడానికి పలు కంపెనీలు 'ఒకటి కొంటే ఒకటి ఉచితం' అని ఆశపెడతాయన్న సంగతి తెలిసిందే. మరికొన్ని సంస్థలు ఒక ప్రొడక్టును కొంటే మరొక ప్రొడక్టునూ ఆఫర్ చేస్తుంటాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈ తరహా ఆఫర్లపై అధిక ఆశను చూపుతుంటారు. ఇక ఈ ఆఫర్లు ఇకపై కస్టమర్లను పెద్దగా అట్రాక్ట్ చేయకపోవచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపాదిత జీఎస్టీ బిల్లు అమల్లోకి వస్తే, ఉచిత వస్తువులపైనా పన్ను భారం పడనుండటమే ఇందుకు కారణం. జీఎస్టీ మోడల్ బిల్లులోని సెక్షన్ 3 ప్రకారం, ఉచిత వస్తువులపై పన్ను విధిస్తారు. దీన్ని వసూలు చేయకుంటే శిక్షార్హులే. అంటే ఉచితంగా లభించే వస్తువుపై జీఎస్టీ పన్ను మేరకు డబ్బు చెల్లించాల్సిందే. అయితే, ఈ విషయంలో మరికాస్త స్పష్టత రావాల్సి వుందన్నది పన్ను రంగంలోని నిపుణుల అభిప్రాయం. ఉచిత వస్తువులపై ప్రత్యక్షంగా లేక పరోక్షంగా జీఎస్టీ ప్రభావం పడితే అది అమ్మకాలు, మార్కెటింగ్ వ్యూహాలను దెబ్బతీస్తుందని, ముఖ్యంగా కన్స్యూమర్ ప్రొడక్టుల విషయంలో భారం పడుతుందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ నేషనల్ ఇన్ డైరెక్ట్ టాక్స్ నిపుణుడు ప్రతీక్ జైన్ అభిప్రాయపడ్డారు. సో, ఇకపై ఏసీ కొంటే ఎల్సీడీ ఉచితం, వాషింగ్ మెషీన్ కొంటే మిక్సీ ఉచితం వంటి ఆఫర్లను చూసి వెళితే, ఉచితంగా వచ్చే ప్రొడక్టుపై అదనపు పన్ను చెల్లించాల్సి వుంటుంది.

  • Loading...

More Telugu News