: నకిలీ అత్యాచారం కేసులు... తర్వాత బ్లాక్ మెయిలింగ్ తో డబ్బు గుంజడం.. దొరికిపోయిన మోసగత్తె!
అతనో యువ వ్యాపారవేత్త. తన స్నేహితుడితో కలిసి కదులుతున్న కారులో కాజల్ అనే యువతిపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. జైలుకు కూడా వెళ్లేవారే. అయితే, కాజల్ స్నేహితుడు కిషన్ తమ ప్లాన్ గురించి చెబుతుండగా, రికార్డు చేసిన ఆడియో క్లిప్ వారిని కాపాడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, తప్పుడు అత్యాచార ఆరోపణలు చేస్తూ, నిందితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులాగి, కేసును పరిష్కరించుకున్నామని చెబుతూ, మరొకరిని ఉచ్చులో బిగించే కిలేడీ కాజల్. అమెకు స్నేహితుడు కిషన్ సహకరిస్తుండేవాడు. ఇక వ్యాపారి, అతని స్నేహితుడు అరెస్టయిన తరువాత, వీరిద్దరికీ ఇద్దరికీ పరిచయస్తురాలైన ఓ యువతి, కిషన్ వద్దకు వెళ్లి మెల్లగా కాజల్ పరిస్థితిని గురించి అడిగి తెలుసుకుని, ఆపై షాకైంది. కిషన్ తో మాట్లాడిన మాటల ఆడియోను పోలీసులకు ఇవ్వగా, వారు నిందితులను విడిచిపెట్టి కాజల్ పై కేసు పెట్టారు. తప్పుడు ఆరోపణలను చేయడం ద్వారా కనీసం రూ. 15 లక్షల వరకూ గుంజాలన్నది కాజల్ ప్లాన్ అని, ఆమె గతంలోనూ ఇలా చేసిందని ఆడియోలో కిషన్ చెప్పాడు. ఓ లగ్జరీ కారును ఎంచుకుని, అందులోని వారిని ముందే గుర్తించి రెక్కీ నిర్వహించడం, ఆపై వారి కారును ఆపి లిఫ్ట్ అడిగి, అత్యాచార ఆరోపణలు చేయడం, నష్టపరిహారానికి డిమాండ్ చేసి డబ్బులెలా వసూలు చేస్తామన్నది పూస గుచ్చినట్టు చెప్పాడు. పోలీసులు వైద్య పరీక్షలకు పంపుతామని చెబితే, కాజల్ గట్టిగా ఏడుస్తూ, వ్యతిరేకించేదని, దీంతో పోలీసులు వెనక్కు తగ్గేవారని కూడా చెప్పాడు. ఈ ఆడియో ఆధారంగా కాజల్ పై విచారణ జరుపుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.