: చైనాలో షాకింగ్ స్కాండల్... కాలేజీ అమ్మాయిలతో 'లోన్ ఫర్ పోర్న్' కుంభకోణం!
కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిలను టార్గెట్ చేస్తూ, ఎంతో కాలంగా చైనాలో జరుగుతున్న 'లోన్ ఫర్ పోర్న్' కుంభకోణం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనం కలిగించింది. చైనా అధికారిక మీడియా, ఈ షాకింగ్ స్కాండల్ కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇందులో ప్రధాన కుట్ర ఇంటర్నెట్ వెబ్ సైట్ల యాజమాన్యాలదని పేర్కొంది. వివిధ యూనివర్శిటీల్లో చదివే అందమైన అమ్మాయిలను లక్ష్యం చేసుకుని, వారిని సంప్రదించి, వారి నగ్న చిత్రాలను సేకరిస్తూ, వారికి రుణాలు అందిస్తున్నారని తెలిపింది. వారి చిత్రాలను తీస్తున్న సమయంలో అమ్మాయిలు చేతుల్లో ఐడీ కార్డులను పట్టుకుని చూపాలన్న నిబంధన ఉందని, ఇది అత్యంత ఘోరమని పేర్కొంది. ఐడీ కార్డు చూపితే, మరింత మొత్తం వారికి దక్కుతుందని, మంచి అందంతో ఉన్న అమ్మాయిలు గుర్తింపు కార్డులు చూపుతూ నగ్న చిత్రాలు దిగితే, వారికి రెండు నుంచి ఐదు రెట్ల వరకూ అదనపు రుణం ఇస్తున్నారని 'ది గార్డియన్', 'బీజింగ్ యూత్ డైలీ'లు కథనాలు ప్రచురించాయి. ఇక తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించకుంటే, వారి చిత్రాలను ఆన్ లైన్లో లీక్ చేస్తామని, అధిక వడ్డీలు కట్టాల్సి వుంటుందని ముందుగానే బెదిరింపులకు పాల్పడుతున్నారని పత్రికలు వెల్లడించాయి. జేడీ కాపిటల్ సంస్థ నిర్వహిస్తున్న 'జిడాయిబావో' వెబ్ సైట్ ఈ మొత్తం కుంభకోణంలో ముందుందని, ఈ సంస్థ ఎలాంటి తనఖాలు లేకుండానే రుణాలు ఇచ్చే సంస్థని పేర్కొంది. కాగా, తమ ఆర్థిక అవసరాలు తీరాలంటే, ఇంతకు మించి మరో మార్గం కనిపించడం లేదని, రుణాన్ని సకాలంలో చెల్లిస్తే, ఏ సమస్యా ఉండదు కదా అని కొందరు అమ్మాయిలు వ్యాఖ్యానించడం గమనార్హం.