: అరుణాచల్ ప్రదేశ్ లోకి చొరబడి సైన్యానికి చాక్లెట్లిచ్చి దర్జాగా వెళ్లిపోయిన చైనా సైనికులు
ఈశాన్య భారతావనిలోని భారత సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ లోకి చొరబడిన చైనా సైనికులు, భారత సైన్యం కంటబడగా, 'పొరపాటున వచ్చాం' అని చెబుతూ చాక్లెట్లను బహుమతులుగా ఇచ్చి దర్జాగా వెళ్లిపోయిన ఘటన ఇప్పుడు సరిహద్దు భద్రతపై కలకలం రేపుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 276 మంది చైనా సైనికులు భారత భూభాగంలోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. యాంగ్తీస్ ప్రాంతంలోని శకార్ తిక్రీ వద్ద వాస్తవాధీన రేఖను దాటిన పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) భారీ బృందాన్ని గమనించిన భారత సైన్యం వారు మరింత ముందుకు రాకుండా చుట్టుముట్టింది. 215 మంది శకార్ తిక్రీ వద్ద, అదే సమయంలో తాంగా లా వద్ద 20 మంది, మీరా గాప్ వద్ద 20 మంది, యాంకీ-1 వద్ద 21 మంది అత్యాధునిక ఆయుధాలతో సరిహద్దులు దాటి వచ్చారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. చైనా చొరబాటుతో ఉద్రిక్తత నెలకొందని, ఆపై వారు తప్పు గమనించి వెనక్కు వెళ్లారని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చైనా సైన్యం పలుమార్లు చొరబాట్లకు యత్నించిన సంగతి తెలిసిందే.