: కొత్త పదవికి కమల్ నాథ్ రాజీనామా... ఆమోదించిన సోనియా
పంజాబ్, హర్యానాల కాంగ్రెస్ ఇన్ చార్జ్ కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా, పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా కమల్ నాథ్ కు రాష్ట్ర బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కలపై జరిగిన దాడుల అల్లర్లలో కమల్ నాథ్ పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఆయన నియామకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కమల్ తన కొత్త పదవికి రాజీనామా చేయగా, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దాన్ని ఆమోదించారు. అంతకుముందు పంజాబ్ లో అధికారంలో ఉన్న శిరోమణి అకాళీ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీలు కమల్ నాథ్ నియామకాన్ని తప్పుబట్టాయి. సిక్కులకు వ్యతిరేకంగా పనిచేసిన ఆయన్ను రాష్ట్రానికి ఎలా తెస్తారని ప్రశ్నించాయి. కాగా, సిక్కుల హత్యాకాండ జరిగిన 21 సంవత్సరాల అనంతరం 2005లో కమల్ పేరును కేసులో జోడించగా, ఆపై నానావతి కమిషన్, ఆయన ప్రమేయం లేదని తేల్చింది.