: వేడి కాఫీ తాగితే క్యాన్సర్ ముప్పు అధికం!
పొద్దున్నే నిద్ర లేచీ లేవగానే బెడ్ కాఫీ పడనిదే మంచం దిగని వారెందరో ఉన్నారు. కప్పు కాఫీ నాలుకకు తగులుతూ కడుపులోకి వెళితే, వచ్చే ఉత్సాహమే వేరు. అయితే, పొగలుకక్కుతూ, వేడివేడిగా ఉన్న కాఫీని తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికమని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) వెల్లడించింది. వేడిగా ఉండే పానీయాలు, వివిధ రకాల క్యాన్సర్లపై పలువురు రీసెర్చర్లు నిర్వహించిన 1000కి పైగా స్టడీ రిపోర్టులను పరిశీలించిన ఐఏఆర్సీ, వాటి ఫలితాలను సమీక్షిస్తూ, కొత్త సమీక్షను విడుదల చేసింది. 65 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలో ఉన్న కాఫీలు తాగితే, కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారని రిపోర్టు పేర్కొంది. కాఫీతో పాటు ఇతర పానీయాలైనా మరీ వేడిగా ఉంటే ఇదే ప్రమాదం సంభవించవచ్చని ఐఏఆర్సీ సమీక్షకుడు డానా లూమిస్ వెల్లడించారు. ఇదే సమయంలో కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయని, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పూ తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయని గుర్తు చేశారు.