: బురిడీ బాబా కారు డ్రైవర్ అరెస్ట్!... కోట్లతో పరారైన బాబా కోసం ముమ్మర గాలింపు!
హైదరాబాదులో ప్రముఖ రియల్టర్, 'లైఫ్ స్టయిల్' బిల్డింగ్ అధినేత మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని బురిడీ కొట్టించి రూ.1.5 కోట్ల విలువ చేసే నగలు, నగదుతో పరారైన నకిలీ బాబా కోసం తెలంగాణ పోలీసులు నిన్న రాత్రి నుంచి ముమ్మర గాలింపు చేపట్టారు. ఇంటి దోషం వదిలించుకునేందుకంటూ మధుసూదన్ రెడ్డి పిలుపుతో హైదరాబాదులో అడుగుపెట్టిన నకిలీ బాబా శివ నిన్న తన చేతివాటం చూపారు. పూజలు చేస్తున్న క్రమంలోనే మత్తు మందు కలిపిన పరమాన్నం పెట్టిన శివ... మధుసూదన్ రెడ్డికి చెందిన నగలు, నగదుతో మాయమయ్యాడు. దీనిపై ఫిర్యాదునందుకున్న పోలీసులు నిన్న రాత్రి నుంచే గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నకిలీ బాబాకు చెందిన కారును పాలమూరు జిల్లా ఎర్రవలిలో గుర్తించిన పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక నకిలీ బాబా ఎటెళ్లారన్న కోణంలో డ్రైవర్ వద్ద వివరాలు సేకరించిన పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.