: తలకు మించిన భారంగా భారీ జెండా!... నిన్న స్తంభంపై కనిపించని జాతీయ పతాకం!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కెల్లా భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేయాలన్న ఆ నిర్ణయం అమల్లోకి కూడా వచ్చేసింది. హైదరాబాదు జంట నగరాల్లోని హుస్సేన్ సాగర్ కు సమీపంలోని సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన ఈ భారీ జెండాను సీఎం కేసీఆర్ ఘనంగా ఆవిష్కరించారు. అయితే ఇప్పటికే ఆ జెండా మూడుసార్లు చిరిగిపోయింది. బలంగా వీస్తున్న గాలుల కారణంగా జెండా చిరిగిపోతుండగా, దానిని కిందకు దించి తిరిగి ఎగురవేయడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఈ జెండా నిర్వహణ బాధ్యతలు చేపట్టిన హెచ్ఎండీఏకు ఈ వ్యవహారం తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. మొన్న రాత్రి జెండా మూడో మారు చిరిగిపోగా... నిన్న దానికి కుట్లు వేసేందుకు అధికారులు కిందకు దించారు. ఆ తర్వాత తిరిగి ఎగురవేసేందుకు చేసిన యత్నాలు గాలి కారణంగా సాధ్యం కాలేదు. దీంతో నిన్న పగలంతా జెండా లేకుండానే స్తంభం బోసిగా కనిపించింది.