: నారాయణ... నిజంగా కార్యదక్షుడే!: సచివాలయ నిర్మాణ పనుల వద్దే బర్త్ డే కేక్ కట్ చేసిన మంత్రి
పొంగూరు నారాయణ... ఈ పేరు పెద్దగా తెలియదు కాని, నారాయణ అంటే మాత్రం మంత్రే కదా అని ఏపీ జనం టక్కున చెప్పేస్తారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో తొలి అధికారం చేపట్టిన టీడీపీ సర్కారులో సీఎం నారా చంద్రబాబునాయుడు ఆయనకు కీలక శాఖను అప్పగించారు. మునిసిపల్ శాఖ మంత్రిగా నారాయణకు బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు... ఆ తర్వాత నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక విభాగం సీఆర్డీఏ పగ్గాలను కూడా ఆయనకే అప్పగించారు. ఈ క్రమంలో రాత్రింబవళ్లు అమరావతి పరిధిలోనే దర్శనమిస్తున్న నారాయణ... ప్రస్తుతం అక్కడి వెలగపూడిలో జరుగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో అంతా తానై వ్యవహరిస్తున్నారు. నిన్న తన జన్మదిన వేడుకలను సైతం పక్కనబెట్టేసిన నారాయణ... చంద్రబాబు వెంట వెలగపూడికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా చంద్రబాబుకు వివరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఇక నారాయణ జన్మదినం విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు... ఓ కేక్ ను అక్కడికే తెప్పించారు. నిర్మాణ పనుల వద్దే నారాయణతో చంద్రబాబు కేక్ కట్ చేయించి ఆయన నోటిని తీపి చేశారు. నిర్మాణ పనుల పరిశీలన క్రమంలో తలపై పెట్టుకున్న హార్డ్ హ్యాట్ (ఇంజినీర్లు వినియోగించే హెల్మెట్)ను తలపై ఉంచుకునే నారాయణ కేక్ కట్ చేశారు.