: చనిపోయాడనుకున్న సైనికుడు ఏడేళ్లకు తిరిగి వచ్చాడు!


చనిపోయాడనుకున్న వ్యక్తి ఏడేళ్ల తరువాత వచ్చి కుటుంబసభ్యులను ఆనందంలో ముంచెత్తిన ఘటన రాజస్ధాన్ లో చోటుచేసుకుంది. భారత ఆర్మీకి చెందిన ధరమ్‌ వీర్‌ యాదవ్‌ అనే సైనికుడు 2009 నవంబరు 27న డెహ్రాడూన్‌ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గతం మర్చిపోయి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఎంత కాలం ఎదురు చూసినా ఆయన తిరిగి రాలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు ధరమ్‌ వీర్‌ మరణించి ఉంటాడని భావించారు. దీంతో ఆయన మరణించారని నిర్ధారించిన ఆర్మీ అధికారులు 2012 నుంచి పెన్షన్‌ కూడా మంజూరు చేశారు. ఇదిలా వుండగా, తాజాగా వీరి ఇంటి తలుపు చప్పుడు కావడంతో ఆయన తండ్రి కైలాష్‌ తలుపు తెరిచారు. తలుపు తీసిన ఆయన ఇది కలా? నిజమా? అని ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఏడేళ్ల క్రితం చనిపోయాడనుకున్న చెట్టంత కొడుకు ఎదురుగా నవ్వుతూ నిల్చున్నాడు. నోటమాటరాని ఆయన పెద్ద కొడుకు, పెద్ద కోడలిని పిలిచారు. వారు వచ్చి ఆయనను లోపలికి తీసుకెళ్లారు. దీంతో జరిగిన ఘటనను ధరమ్‌ వీర్‌ వివరించాడు. గతం కోల్పోయిన తనను కొద్ది రోజుల క్రితం హరిద్వార్‌ లో ఓ మోటార్‌ సైకిల్‌ ఢీకొట్టిందని, ఆ సందర్భంగా తన తలకు గాయమైందని ఆ సమయంలో తనకు తిరిగి గతం గుర్తొచ్చిందని చెప్పారు. దీంతో తనను మోటారు సైకిల్‌ తో ఢీ కొట్టిన వ్యక్తిని 500 రూపాయలు అడిగి తీసుకుని గత రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అయితే తన కుమారుడు వచ్చాడంటే ఎవరూ నమ్మడంలేదని మాజీ సైనికుడైన ధరమ్ వీర్ తండ్రి కైలాష్‌ వాపోతున్నారు. దీనిపై సమాచారం అందిందని అల్వార్‌ జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్పీ యాదవ్‌ నిర్ధారించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తానని ఆయన చెప్పారు. ధరమ్ వీర్ ను చూసి ఆతని భార్య, ఇద్దరు కుమార్తెలు ఆనందంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News