: ఆ రాజుగారికి వంద మంది భార్యలు, 500 మంది పిల్లలు!
అనగనగా ఒక రాజు, ఆయనకు ఏడుగురు కొడుకులు... ఈ కథ అంతా వినే ఉంటారు. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం కాస్త డిఫరెంట్. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి వంద మంది భార్యలు...! ప్రపంచంలో రాజ్యాలు దాదాపు అంతరించిపోయాయి, కానీ రాజులు మాత్రం అక్కడక్కడ మిగిలేవున్నారు. ఇంకా తమ దర్పాన్ని వెలగబెడుతూ కనిపిస్తూనే వున్నారు. ఆఫ్రికాలోని కేమరూన్ దేశంలో బఫుట్ అనే గిరిజన ప్రాంతముంది. అక్కడి వారికి బహుభార్యత్వం సంప్రదాయం. అయితే వారి పోషణ భారం కావడంతో మరీ ఎక్కువ మంది భార్యలు లేకుండా పరిమితంగా భార్యలను కలిగి ఉంటారు. రాజుకి ఇలాంటి ఇబ్బందులు ఉండవు కనుక ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో సంప్రదాయం కూడా ఉంది. తండ్రి మరణానంతరం రాజులైన వారి వారసులు తండ్రి భార్యలను తమ భార్యలుగా చేసుకొనే షాకింగ్ సంప్రదాయం వీరి సొంతం. దీంతో ప్రస్తుతం రాజుగా వెలుగొందుతున్న అబుంబి-2 రాజు భార్యల సంఖ్య 100కి చేరింది. వాస్తవానికి అబుంబి భార్యల సంఖ్య 28 మందే, అయితే ఆయన తండ్రి అచిరింమి-2 డెభ్బై రెండు మందిని వివాహం చేసుకున్నాడట. 1968లో ఆయన చనిపోయిన తర్వాత సింహాసనం అధిష్టించిన అబుంబి-2 తండ్రి భార్యలను తన భార్యలుగా చేసుకోవడమే కాకుండా, మరో 28 మందిని పెళ్లాడాడు. దీంతో వారి సంఖ్య 100 కు చేరుకుంది. ఇక ఈ వంద మందికి 500 మంది పిల్లలుండడం మరో రికార్డు!