: 'అందరూ రావాల్సిందే' నుంచి 'వీలైనంత మంది'... ఉద్యోగుల తరలింపు విషయంలో మెట్టుదిగిన చంద్రబాబు!
నిన్నటి వరకూ 27వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులంతా అమరావతి ప్రాంతానికి రావాలని, గుంటూరు, విజయవాడల్లో ఆఫీసులు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే పాలన సాగించాలని గట్టిగా చెబుతూ వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు ఓ మెట్టు దిగారు. ఈ మధ్యాహ్నం వెలగపూడిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, 27 నాటికి వీలైనన్ని శాఖలు అమరావతికి వస్తాయని, వీలైనంత మందిని రప్పిస్తామని అన్నారు. ఎన్ని శాఖలు తరలివస్తాయన్న విషయంపై 22వ తేదీకి స్పష్టత వస్తుందని, ఆ శాఖల్లో కూడా కొందరు హైదరాబాద్ లో ఉంటారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మంత్రులూ, కార్యదర్శులూ ఒకే చోట ఉంటారని, అందుకు కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ సుపరిపాలన అందించడమే తన లక్ష్యమని, ప్రతి ఒక్కరిలో అభివృద్ధి తపన పెరగాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా మరింత పారదర్శకతను తెస్తామని పేర్కొన్నారు.