: 130 కంటెయినర్ల వేరుశనగను ఆపేసిన పాక్... భారత్ తో 'కోతి వ్యాపారం'!
కోతి సంగతి తెలుసుగా... ఇంట్లోని ఏదో ఒక వస్తువు పట్టుకెళ్లి గోడపై కూర్చుని బేరం పెడుతుంది. తాను తినడానికి అరటిపండో, కొబ్బరిచిప్పో ఇస్తేనే, వస్తువును వదిలి అక్కడి నుంచి వెళుతుంది. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే పని చేస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇండియాకు చెందిన నాలుగు సంస్థలు 130 కంటెయినర్లలో 2,500 టన్నుల వేరుశనగను ఎగుమతి చేస్తే, దాదాపు 8 నెలల నుంచి అవి కరాచీ నౌకాశ్రయంలో మూలన పడివున్నాయి. రెండు పాక్ సంస్థలు వాటిని ఆర్డర్ చేశాయి. అవి డెలివరీ తీసుకోకపోగా, కంటెయినర్లను వెనక్కు తీసుకుపోతామంటే కూడా పాక్ ప్రభుత్వం తమకేమి లాభమని బేరాలు పెట్టింది. కంటెయినర్లకు అద్దెలు కట్టాలని, సుంకాలు చెల్లించాలని మడత పేచీలు పెడుతోంది. ఈ మొత్తం డీల్ గురించి ఎం లఖాంసీ అండ్ కంపెనీ చైర్మన్ సంజీవ్ ఎం సావ్లా వివరిస్తూ, "మలేషియాలో రిజిస్టరైన పూరి అగ్రీ ట్రేడ్ అనే సంస్థ పాక్ లోని యూనిటీ కమోడిటీస్, హెచ్ వై ఇంటర్నేషనల్ అనే సంస్థలకు డెలివరీ ఇచ్చేందుకు ఈ కాంట్రాక్టు కుదుర్చుకుంది. మాతో పాటు దివ్యా కార్పొరేషన్, ఆర్ కే ఇండస్ట్రీస్, పటేల్ రవ్జీ మావ్జీ సంస్థలు వేరుశనగను సరఫరా చేశాయి. కంటెయినర్లు పాక్ చేరిన తరువాత పాక్ కంపెనీలు, మలేషియా సంస్థ ఒకరివేనని తేలింది. దీంతో పాక్ ప్రభుత్వం పేచీ మొదలైంది. డెలివరీకి అంగీకరించడం లేదు. దీన్ని మేము కరాచీ హైకోర్టులో సవాల్ చేశాం. రేపు ఒకవేళ తీర్పు మాకు అనుకూలంగా వచ్చినప్పటికీ, ఇన్నాళ్లుగా ఇక్కడ నిల్వ ఉండిపోవడం వల్ల ఈ వేరుశనగ మానవ వినియోగానికి పనికికాకుండా పోతుంది" అని తెలిపారు. ఇండస్ట్రీ వర్గాల మరో కథనం ప్రకారం, పాక్ సంస్థలు చైనాకు విక్రయించేందుకు ఈ డీల్ కుదుర్చుకున్నాయని తెలుస్తోంది. చైనాతో డీల్ కుదరకపోవడంతో, డెలివరీని తీసుకోకుండా ప్రభుత్వంతో నాటకం ఆడిస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తమను రూ. 2 కోట్లు కట్టమని పాక్ డిమాండ్ చేస్తోందని దివ్యా కార్పొరేషన్ చైర్మన్ తేజాస్ బదానీ ఆరోపించారు. ఈ కంటెయినర్లకు సుంకాలు కట్టాలని పాక్ అధికారులు నోటీసులు ఇవ్వగా, డెలివరీయే లేకుండా సుంకాలెలా చెల్లిస్తామని భారత కంపెనీలు వాదిస్తున్నాయి.