: వ్యాపారాలు కాపాడుకునేందుకే పార్టీ వీడుతున్నారు: హైదరాబాద్‌లో దిగ్విజయ్ సింగ్
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గడ్డుపరిస్థితులను ఎదుర్కుంటోన్న వేళ ఆ పార్టీ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిన్న టీపీసీసీ అధ్యక్షుడు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులపై వివరించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ మళ్లీ పుంజుకునేలా చేయడమే లక్ష్యంగా ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపారాలు, పదవులను కాపాడుకునేందుకే నేతలు పార్టీ వీడుతున్నారని అన్నారు. ఎంత మంది పార్టీని వీడినా రాష్ట్రంలో కాంగ్రెస్‌కి వచ్చిన నష్టమేమీ లేదని ఆయన ఉద్ఘాటించారు. పార్టీ నాయకుల్లో విభేదాలను తగ్గించి, సమన్వయం పెరిగేలా చెయ్యాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఉత్తమ్ కుమార్, జానారెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ సమావేశం నిర్వహించనున్నారు.