: సహ చట్టం కింద దరఖాస్తు చేస్తే... ముందుగా భారతీయుడివని నిరూపించుకోమన్న హోం శాఖ
పాలనలో పాదర్శకత కోసం యూపీఏ సర్కారు సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలోని ఏ వ్యక్తి కోరినా... ఆయా ప్రభుత్వ శాఖలు సమగ్ర సమాచారాన్ని అందించాల్సిందే. ఒక్క దేశ రక్షణకు సంబంధించిన విషయాలకు మాత్రమే ఈ చట్టం నుంచి మినహాయింపు ఉంది. అయితే పలు కీలక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు ఆయా ప్రభుత్వ శాఖలు మోకాలొడ్డుతూనే ఉన్నాయి. సమాచార వెల్లడికి నిరాకరిస్తున్న ఆయా శాఖలు తమకు తోచిన కారణాలు చెబుతున్నాయి. తాజాగా కేంద్ర హోం శాఖ ఇష్రాత్ జహాన్ కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించేందుకు ఏకంగా ఓ కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. హోం శాఖ చెప్పిన కారణం విని దేశంలోని యావత్తు సహ చట్టం కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ లో కలకలం రేపిన ఇష్రాత్ జహాన్ కేసుకు సంబంధించిన వివరాలందించాలని సహ చట్టం కింద దరఖాస్తు చేసుకున్న అజయ్ దూబేను... ముందుగా తమకు భారతీయుడినేనని నిరూపించుకోవాలని హోం శాఖ ప్రత్యుత్తరమిచ్చింది. సమాచారం వెల్లడికి నిరాకరించే క్రమంలోనే ఈ తరహా అసందర్భ ఆదేశాలను హోం శాఖ జారీ చేస్తోందని దూబే ఆగ్రహం వ్యక్తం చేశారు.