: శక్తిమంతమైన యూఎస్ యుద్ధ నౌకపై చైనా గూఢచర్యం!
అమెరికాకు ఉన్న అత్యంత శక్తిమంతమైన యుద్ధ నౌకల్లో ఒకటైన జాన్ సీ స్టెన్నిస్, ఇండియా, జపాన్ యుద్ధ నౌకలతో కలిసి పసిఫిక్ మహా సముద్రంలో విన్యాసాలు చేస్తున్న వేళ, చైనా నిఘా నౌక ఒకటి నీడలా వెంబడించడం కలకలం రేపింది. చైనాకు హక్కున్న జలాలకు సమీపంలో ఈ విన్యాసాలు నిర్వహిస్తుండగా, తమ హక్కులకు భంగం కలుగకుండా చూసేందుకు మాత్రమే ఈ షిప్ రహస్యంగా వెంబడించినట్టు చైనా అధికారులు వాదించినప్పటికీ, దీంతో పాటు కొన్ని సబ్ మెరైన్లు సైతం ఆ ప్రాంతంలో మోహరించినట్టు విన్యాసాలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. కాగా, దాదాపు లక్ష టన్నుల బరువుతో ఉండే స్టెన్నిస్, ఎఫ్-18 ఫైటర్ జెట్ల నుంచి ఎన్నో వాహనాలను, అణ్వాయుధాలను మోసుకు పోగలుగుతుంది. ఈ విన్యాసాల్లో స్టెన్నిస్ తో పాటు, 9 ఇతర షిప్ లు, ఓ జపాన్ హెలికాప్టర్, భారత ఫ్రిగేట్స్, సబ్ హంటింగ్ పెట్రోల్ విమానాలు, జపాన్ బేస్ గా పాల్గొన్నాయి. స్టెన్నిస్ శక్తి సామర్థ్యాలను దగ్గరగా పరిశీలించేందుకే చైనా గూఢచార నౌకలు సంచరిస్తున్నాయని తెలుస్తోంది.