: కేవలం మహిళలతో, హిందూ మహాసముద్రంలో ప్రయాణించి పోర్టు లూయిస్ చేరి చరిత్ర సృష్టించిన ఐఎన్ఎస్వీ మహాదేవి
భారత నావికాదళ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. కేవలం ఆరుగురు మహిళలతో ఉన్న ఐఎన్ఎస్వీ మహాదేవి, తుపాను వాతావరణంతో ఉన్న హిందూ మహాసముద్రంలో క్షేమంగా ప్రయాణించి పోర్టు లూయిస్ చేరిందని అధికారులు వెల్లడించారు. గోవా నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన ఐఎన్ఎస్వీ మహాదేవి, మొత్తం 2,100 నాటికల్ మైళ్లను 20 రోజుల్లో ప్రయాణించిందని తెలిపారు. ఇండియన్ నేవీ హిస్టరీలో అందరూ మహిళలే ఉన్న తొలి నౌకా ప్రయాణం ఇదేనని తెలిపారు. పోర్టు లూయిస్ చేరిన నౌకకు, అక్కడి భారత హై కమిషనర్, మారిషస్ నేషనల్ కోస్ట్ గార్డ్ కమాండెంట్, పలువురు అధికారులు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారని తెలిపారు. తీరానికి 10 మైళ్ల దూరంలో 10 మంది మారిషస్ మహిళా పోలీసు అధికారులు నౌకకు స్వాగతం పలికి తీరానికి తీసుకు వెళ్లారని వివరించారు. అక్కడ 24 వరకూ ఉండే నౌకలోకి పాఠశాల విద్యార్థులు, సందర్శకులను అనుమతిస్తామని, ఆపై మహిళా బృందం తిరిగి గోవాకు బయలుదేరుతుందని తెలిపారు.