: శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఊరట!... ‘వ్యాపం’లో రాజకీయ కుట్ర లేదన్న సీబీఐ!
బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు పెద్ద ఊరటే లభించింది. మధ్యప్రదేశ్ లో వరుస హత్యలతో కలకలం రేగిన ‘వ్యాపం’ కుంభకోణంలో రాజకీయ కుట్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తేల్చేసింది. అంతేకాకుండా ఈ కుంభకోణంలో వ్యవస్థీకృత నేర కోణం కూడా కనిపించలేదని ఆ సంస్థ తేల్చిచెప్పింది. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, సర్కారీ ఉద్యోగాల ఎంపికలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగానే... ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు కీలక వ్యక్తులు వరుస హత్యలకు గురయ్యారు. ఈ క్రమంలో ఈ కేసులో వ్యవస్థీకృత నేర ప్రవృత్తితో పాటు రాజకీయ కుట్ర కోణం కూడా ఉందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ కేసు దర్యాప్తును దాదాపుగా పూర్తి చేసిన సీబీఐ నిన్న కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో రాజకీయ కుట్రతో పాటు వ్యవస్థీకృత నేర ప్రవృత్తి కనిపించలేదని ఆ సంస్థ చేసిన ప్రకటనలో విమర్శల సుడిలో చిక్కుకున్న చౌహాన్ కు భారీ ఊరట లభించింది.