: అందాల వల వేసి ఏడుగురిని మనువాడిన మాయలేడి!... అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తన అందచందాలనే పెట్టుబడిగా పెట్టి పలువురు యువకులను బురిడీ కొట్టిస్తూ భారీగా ధనం సంపాదించిన ఓ మాయలేడికి ఎట్టకేలకు తమిళనాడు పోలీసులు సంకెళ్లేశారు. అందాల వల వేసిన ఆ మాయలేడి అప్పటికే ఏడుగురు యువకులను పెళ్లి చేసుకుని, ఆపై బాధితుల వద్ద నుంచి సొమ్ముతో పరారైందట. వివరాల్లోకెళితే... తమిళనాడులోని తిరువూరు జిల్లా తారాపురం సమీపంలోని గొప్పన గౌండం పాళయంకు చెందిన సెల్వకుమార్... పవిత్ర అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న పవిత్రను అతడు బాగానే చూసుకుంటున్నా... ఆమె మాత్రం అతడి వద్ద నుంచి విలువైన నగలు, నగదును దోచుకుని పారిపోయింది. దీంతో షాక్ తిన్న సెల్వకుమార్ తారాపురం పోలీస్ స్టేషన్ లో పవిత్రపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా పవిత్ర అప్పటికే మరో ఆరుగురు యువకులను ఈ తరహాలోనే మోసం చేసిందని తేలడంతో పోలీసులు షాక్ తిన్నారు. ధనవంతుల కుటుంబాలకు చెందిన యువకులను టార్గెట్ చేసుకున్న పవిత్ర ఈ తరహా మోసానికి పాల్పడింది.