: బెట్టు వీడని ముద్రగడ!... పట్టు సడలించని చంద్రబాబు సర్కారు!
కాపుల రిజర్వేషన్ల కోసమంటూ ఉద్యమ బాట పట్టిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణకు సంబంధించి... ఇటు కాపు నేత నుంచి కాని, అటు ప్రభుత్వం నుంచి కాని అడుగు ముందుకు పడటం లేదు. ఇప్పటికే ముద్రగడ డిమాండ్ల పరిష్కారానికి దాదాపుగా సరేనన్న సీఎం నారా చంద్రబాబునాయుడు.. ముందుగా ముద్రగడ దీక్ష విరమిస్తే ఆ తర్వాత ఆయన డిమాండ్ల పరిష్కారంపై ఆలోచిస్తామని కాస్తంత సానుకూల ప్రకటన చేశారు. అయితే ముందుగా డిమాండ్లు పరిష్కరిస్తున్నట్లు ప్రకటన చేస్తేనే తాను దీక్ష విరమిస్తానని ముద్రగడ మొండికేస్తున్నారు. తుని విధ్వంసకారులంటూ పలువురు కాపు యువకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ముద్రగడ దీక్ష చేపట్టారు. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేర్చినా... ముద్రగడ న దీక్షను మాత్రం విరమించలేదు. ఆయన దీక్ష నేటికి ఏడో రోజుకు చేరింది. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయనతో తక్షణమే దీక్ష విరమించే దిశగా చర్యలు చేపట్టక తప్పదని వైద్యులు చెబుతున్నారు. అయితే ముందుగా డిమాండ్ల పరిష్కారమంటూ ముద్రగడ... దీక్ష విరమణ తర్వాత డిమాండ్ల పరిష్కారమంటూ ప్రభుత్వం బెట్టుతో వ్యవహరిస్తున్న నేపథ్యంలో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.