: చంద్రబాబు కావాలనే ఇదంతా చేస్తున్నారు... ఐదు నిమిషాల్లో పరిష్కారమయ్యే సమస్య ఇది!: ముద్రగడ దీక్షపై ఉండవల్లి
రాజకీయంగా ప్రయోజనం ఎలా వుంటే, చంద్రబాబు అలా చేస్తాడనేది కొత్తగా చెప్పాల్సిన అంశం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేయడం చంద్రబాబుకు చిటికెలో పని అని అన్నారు. అయితే అలా చేయడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. తుని ఘటనలో కేసులు ఎదుర్కొంటున్నవారిని విడుదల చేయడం 'ఒక రోజు' పని అని ఆయన చెప్పారు. ప్రభుత్వం కేసులు పెట్టిన వారు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటారని, అవి విచారణకు వచ్చినప్పుడు జడ్జి ఏమైనా అభ్యంతరముందా? అని అడుగుతారని, ప్రభుత్వం అభ్యంతరం లేదని చెబితే...వారికి వెంటనే బెయిల్ మంజూరవుతుందని, మధ్యాహ్నానికల్లా ష్యూరిటీలు వస్తారు, సంతకాలు పెడతారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆర్డర్లు రెడీ అవుతాయి. ఐదు గంటల కల్లా వారు బయటకి వస్తారని ఆయన చెప్పారు. ఈ మాత్రానికి ముద్రగడను వేధించాల్సిన అవసరం లేదని, అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనిని ఎవరు ప్రశ్నించగలరని ఆయన చెప్పారు. గతంలో కులం పేరు చెప్పి రాయబారం నడిపిన వారు ఆయనను మోసం చేశారని, అందుకే ఆయన ప్రభుత్వాన్ని నమ్మడం మానేశారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అందుకే, హామీలను జేఏసీ ముందు ఇమ్మంటున్నారని ఆయన అన్నారు.