: స్మృతి ఇరానీని 'డియర్' అంటూ సంబోధించిన బీహార్ మంత్రి... అభ్యంతరం చెప్పిన స్మృతి!
ట్విట్టర్ వేదికగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, బీహార్ విద్యాశాఖ మంత్రి మధ్య జరిగిన ట్వీట్ల యుద్ధం నెటిజన్లకు వినోదాన్ని పంచింది. వివరాల్లోకి వెళ్తే...‘డియర్ స్మృతీ ఇరానీజీ! కొత్త విద్యా విధానం ఎప్పుడు వస్తుంది..? మీ క్యాలెండర్‌లో 2015 ఎప్పుడు ముగుస్తుంది?’ అంటూ బీహార్ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చౌదరి ట్వీట్ చేశారు. దీనికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సమాధానమిస్తూ 'మహిళలను డియర్ అంటూ సంబోధించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు, అశోక్ చౌదరీజీ?' అంటూ ఎదురు ప్రశ్నించారు. దీనిపై మండిపడ్డ అశోక్ చౌదరి... విద్యావంతులు, ప్రొఫెషనల్ మెయిల్స్ ‘డియర్’తో ప్రారంభమవుతాయని.. ఇది అవమానపరచడానికి కాదని, విషయం తెలియజేయడం కోసం చెబుతున్నానని కౌంటర్ ఇచ్చారు. దీనికి తాను ‘ఆదరణీయ’ అంటూ సంభాషణ ప్రారంభిస్తానని ఆయనకు స్మృతీ ఇరానీ సమాధానమిచ్చారు. దీనిపై అశోక్ చౌదరి 'లేని వాటిని వివాదం చేయడం మానేసి...ఆరోపణకు సమాధానమివ్వండి' అని సూచించారు. దీనిపై స్మృతీ ఇరానీ 'దిగువ స్థాయిలో విద్యా విధానంపై సంప్రదించని ఒకే ఒక రాష్ట్రం బీహార్' అని ఎద్దేవా చేశారు. దీనిపై మండిపడ్డ ఆయన 'ముందు మీరు ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయండి... అప్పుడు నీళ్లకు నీళ్లు, పాలకు పాలు తేలిపోతా'యని సమాధానమిచ్చారు. ఈ ట్వీట్ల యుద్ధాన్ని నెటిజన్లు ఆసక్తిగా గమనించడం విశేషం.