: వారు కోరుకున్న తెలంగాణ ఇదేనా?: జానారెడ్డి
తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లోకి జంప్ చేస్తోన్న తమ పార్టీ నేతలపైన, టీఆర్ఎస్ పైన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. భ్రష్టు రాజకీయాలతో బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా టీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు. ప్రజల కలలను నెరవేరుస్తూ తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన అన్నారు. సోనియాపై టీఆర్ఎస్ నేతలకు ఏ మాత్రం కృతజ్ఞత లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని, పార్టీ కండువాలు మారుస్తోన్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని జానారెడ్డి అన్నారు. ఎన్నో కలలను నెరవేర్చుకునే క్రమంలో మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు తెలంగాణను కోరుకున్నారని, టీఆర్ఎస్ వారి కలలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని వారు కోరుకున్న తెలంగాణ ఇదేనా..? అని ఆయన ప్రశ్నించారు.