: కెన్నడీ ఆఫర్ కు నెహ్రూ ఓకే చెప్పి ఉంటే... భారత్ కు ఎన్ఎస్జీ సభ్యత్వం ఎప్పుడో వచ్చేదట!


అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎడతెరిపి లేకుండా మంతనాలు సాగిస్తున్నారు. మొన్నటి వియన్నా భేటీలో బారత్ కు సభ్యత్వం వచ్చినట్టే వచ్చి వాయిదా పడిందన్న వార్తలూ వినిపించాయి. అయితే ఈ నెల 20న దక్షిణ కొరియా రాజధాని సీయోల్ లో జరిగే కూటమి భేటీలో భారత్ కు ఎన్ఎస్జీ సభ్యత్వం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మహారాజకృష్ణ రాస్ గోత్రా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. 'ఏ లైఫ్ ఇన్ డిప్లొమసీ’ పేరిట తాను రాసిన ఓ పుస్తకంలో భారత్ కు ఎన్ఎస్జీ సభ్యత్వం ఎప్పుడో వచ్చి ఉండేదని రాస్ గోత్రా పేర్కొన్నారు. ఈ మేరకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను రాస్ గోత్రా ప్రస్తావించారు. ‘అణ్వస్త్ర పాటవాన్ని సముపార్జించుకోండి... సాయం చేస్తాం’’ అంటూ కెన్నడీ 1950లో నెహ్రూకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్యానికి అభిమాని అయిన కెన్నడీ ఈ మేరకు భారత్ కు ప్రతిపాదించారట. అయితే అందుకు నెహ్రూ ససేమిరా అన్నారని రాస్ గోత్రా చెప్పుకొచ్చారు. ఒకవేళ కెన్నడీ ప్రతిపాదనకు నెహ్రూ తలాడించి ఉంటే... చైనా కంటే ముందుగానే ఆసియాలో అణు పరీక్ష చేసిన దేశంగా భారత్ రికార్డులకు ఎక్కేది. అంతేకాక 1962లో భారత్ పైకి చైనా దూసుకువచ్చేదే కాదు. అంతేకాదు, 1965లో పాకిస్థాన్ తో యుద్ధమూ వచ్చేదీ కాదు. ఇక ప్రస్తుతం ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ పాకులాడే దుస్థితి కూడా వచ్చేది కాదని రాస్ గోత్రా పేర్కొన్నారు. నాటి కెన్నడీ ప్రతిపాదన విషయాన్ని భారత అణు పితామహుడు హోమీ బాబా, జీపీ పార్థసారధిల ముందు పెట్టి సమాలోచనలు చేసిన నెహ్రూ.. అమెరికా ఆఫర్ ను తిరస్కరించారు. స్వయంగా తన చేవ్రాలుతో రాసిన ఆ లేఖలో కెన్నడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని కూడా రాస్ గోత్రా వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంగా ఉన్న తాము అణ్వస్త్రాల బాట పట్టడం భావ్యం కాదన్న నెహ్రూ అభిప్రాయంపై స్పందించిన కెన్నడీ... ‘దేశ భద్రత కంటే ముఖ్యమైనదేదీ లేదు’ అని కూడా నచ్చజెప్పేయత్నం చేశారట. అయినా నెహ్రూ అమెరికా ప్రతిపాదనకు నో చెప్పేశారు. ఆ తర్వాత నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ తొలి అణు పరీక్ష జరిపించి సంచలనం రేపారు. ఇక నాటి నుంచి భారత అణ్వస్త్ర పాటవం శరవేగంగా పెరుగుతూ వస్తోంది. ఇందిరా, రాజీవ్ గాంధీలు ప్రధానిగా ఉన్న సమయంలో రాస్ గోత్రా భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News