: ఇక గడప గడపకూ తరలండి: జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అన్ని స్థాయులలోని నేతలూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లాలని, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతిని విడమరచి చెప్పాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ ఉదయం వైకాపా విస్తృత స్థాయి సమావేశం విజయవాడలో ప్రారంభం కాగా, ఆయన ప్రాథమిక ఉపన్యాసం చేశారు. ఐదేళ్ల క్రితం ఇదే సమయాన తనతో ప్రారంభమైన పార్టీ, ఆపై 18 మంది ఎమ్మెల్యేలకు, తరువాత 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీల స్థాయికి పెరిగి కోటిన్నర మందికి పైగా ప్రజల ఓట్లను దక్కించుకుందని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కోట్లాది రూపాయలను గుమ్మరించి వైకాపా నేతలను లోబరచుకుందని ఆయన ఆరోపించారు. త్వరలో ప్రారంభమయ్యే 'గడప గడపకూ' కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను సమావేశం ముగిసేలోగా ఖరారు చేసి తెలియజేస్తామని వివరించారు. ఆపై వైకాపా నేతలు పెద్దిరెడ్డి, భూమన తదితరులు ప్రసంగించారు.