: ఢిల్లీలో మద్యం మత్తులో కారు నడిపి బీభత్సం సృష్టించిన యువకుడు.. ఇద్దరి మృతి
ఢిల్లీలో డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ ఓ యువకుడు రోడ్డుపై అలజడి సృష్టించాడు. తప్పతాగి రోడ్డుపై కారు నడుపుతూ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేశాడు. తాగిన మత్తులో ఒళ్లు తెలీకుండా కారు నడుపుతూ ఇద్దరి మరణానికి కారణమయ్యాడు. అక్కడి జనక్ పురికి చెందిన రిషబ్(21) అనే యువకుడు ఈ బీభత్సం సృష్టించాడు. పార్టీకి వెళ్లి వస్తూ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేస్తూ వరసగా ముగ్గురిని ఢీ కొట్టాడు. దీంతో కామేశ్వర్ ప్రసాద్(40), ఆనంద్ (67) అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సంతోష్ (40) అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రిషబ్ నడిపిస్తోన్న కారును వెంబడించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.