: బిల్ గేట్స్ తో కానిది... సత్య నాదెళ్లతో అయ్యింది!: లింక్ డ్ ఇన్ టేకోవర్ లో చక్రం తిప్పిన తెలుగు తేజం!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సాధ్యం కానిది, ఆ సంస్థలో చిన్న ఉద్యోగిగా చేరి సీఈఓ స్థాయికి ఎదిగిన తెలుగు తేజం సత్య నాదెళ్లతో అయ్యింది. ఆయా రంగాలకు చెందిన నిపుణుల మధ్య సంధానకర్తగా సత్తా చాటుతున్న ‘లింక్ డ్ ఇన్’ను టేకోవర్ చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లింక్ డ్ ఇన్ ను చేజిక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ గతంలో చాలా సార్లు యత్నించిందట. అయితే ఫలితం దక్కలేదు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో టేకోవర్లతో దూసుకెళుతున్న సత్య నాదెళ్ల... లింక్ డ్ ఇన్ ను చేజిక్కించుకోవడంలో సఫలీకృతులయ్యారు. మొదటి నుంచి లింక్ డ్ ఇన్ కు తాను పెద్ద అభిమానిని అని చెప్పుకున్న సత్య నాదెళ్ల... ఆ సంస్థను టేకోవర్ చేసుకునేందుకు ఫిబ్రవరిలో చర్యలు ప్రారంభించారట. విడతలవారీగా జరిగిన చర్చల ఫలితంగా లింక్ డ్ ఇన్ ను మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసే పనిని నాదెళ్ల విజయవంతంగా ముగించారు.