: విప్రోకు షాకిచ్చిన ఏపీ సర్కారు!... విశాఖలో ఐటీ దిగ్గజానికి ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకున్న వైనం!


దేశీయ ఐటీ దిగ్గజం విప్రో టెక్నాలజీస్ కు నిన్న ఏపీ సర్కారు ఝలక్కిచ్చింది. గతంలో ఆ సంస్థకు ఇచ్చిన భూమిని, అందులో ఆ సంస్థ నిర్మించిన భారీ భవంతిని లాగేసుకునేందుకు దాదాపుగా నిర్ణయించింది. దీంతో అప్పటికే ప్రభుత్వం ఇచ్చిన భూమిలో భారీ భవంతిని నిర్మించి అందులో బీపీవో కేంద్రాన్ని నడుపుతున్న విప్రో... తన కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు రంగంలోకి దిగక తప్పలేదు. వివరాల్లోకెళితే... విశాఖలో ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పిన విప్రో... అప్పటి ప్రభుత్వం నుంచి నగరంలోని సత్యం జంక్షన్ లో 7.1 ఎకరాల స్థలాన్ని తీసుకుంది. ఇందుకోసం ఆ సంస్థ ఎకరాకు రూ.50 లక్షలు చెల్లించింది. 6,400 మందికి ఉపాధి కల్పిస్తామని విప్రో చెప్పడంతో కోట్ల ఖరీదు చేసే ఆ భూమిని ప్రభుత్వం ఆ సంస్థకు నామమాత్రపు ధరకే అందజేసింది. ఆ తర్వాత సదరు భూమిలోని 4 ఎకరాల్లో విప్రో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవంతిని కట్టింది. ఆ తర్వాత అక్కడ కార్యకలాపాలను ఆ సంస్థ ప్రారంభించేందుకు ఆసక్తి చూపలేదు. నాడు విశాఖ ఎంపీ హోదాలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి ఇదేంటని ప్రశ్నించడంతో బీపీఓ కేంద్రాన్ని ప్రారంభించింది. అందులోనూ కేవలం 650 మందికే ఉపాధి కల్పించింది. విప్రో కార్యకలాపాలకు సంబంధించి అనుమానం వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి అంతగా అనుకూల పరిస్థితులు లేవని కంపెనీ ఆయనకు బదులిచ్చింది. దీంతో అక్కడ సెజ్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని రాజు నిలదీశారు. దీనికి కంపెనీ నీళ్లు నమలడంతో రాజు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ స్థలంలో ఖాళీగా ఉన్న 3.1 ఎకరాలను వెనక్కు తీసుకోవాలని దాదాపుగా నిర్ణయించిన ప్రభుత్వం... తదుపరి దశలో భవనాన్ని కూడా స్వాధీనం చేసుకుని ఇంక్యుబేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. ప్రభుత్వం యోచన అర్థమైన విప్రో... తన బీపీఓ కార్యాలయం కోసం మరో భవనాన్ని వెతుక్కునే పనిని ప్రారంభించింది. ప్రభుత్వం నుంచి అందిన సంకేతాలు, తమ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కంపెనీ ధ్రువీకరించింది.

  • Loading...

More Telugu News