: ఆసక్తి రేపుతున్న జయలలిత ఢిల్లీ పర్యటన... ఎన్డీయేలో కలిసేందుకేనా?
తమిళనాడులో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి చరిత్ర సృష్టించిన జయలలిత, నేడు తొలిసారిగా ఢిల్లీలో పర్యటించనుండటం, ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలవనుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పర్యటన రాజకీయంగా ఎంతో కీలకమైనదని, జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీ ఎన్డీయేలో భాగస్వామిగా చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల తరువాత బీజేపీ బలం పెరిగినప్పటికీ, కీలకమైన జీఎస్టీ వంటి బిల్లుల ఆమోదానికి అది చాలదు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే మద్దతుంటే, తమ పనిని ఇంకాస్త సులువు చేసుకోవచ్చన్నది మోదీ ఆలోచనగా తెలుస్తోంది. జయలలిత పార్టీకి లోక్ సభ, రాజ్యసభల్లో 50 మంది సభ్యులున్నారు. వీరంతా ఎన్టీయేకు మద్దతిస్తే బిల్లుల ఆమోదానికి అడ్డంకులు ఉండవని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే మోదీకి నమ్మకమైన స్నేహితునిగా ఉంటూ వస్తున్న అన్నాడీఎంకే, కూటమిలో చేరితే ధైర్యంగా సంస్కరణల అమలుకు ముందుకు దూకవచ్చని మోదీ స్వయంగా తన మంత్రులతో వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జయలలితను కూటమిలో చేరాలని మోదీ స్వయంగా ఆహ్వానించవచ్చని, అందుకు ఆమె సైతం నిరాకరించే అవకాశాలు తక్కువేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.