: గిన్నిస్ రికార్డులకెక్కిన కన్నడ ఎమ్మెల్సీ!...వరుసగా 7 సార్లు శాసన మండలికి ఎన్నికైన బసవరాజ!
రాష్ట్ర స్థాయి శాసన నిర్మాణ వ్యవస్థలో పెద్దల సభగా పేరుపడ్డ శాసన మండలిలో ఒక్కసారి సభ్యత్వం దొరకడమే గగనమైన ప్రస్తుత తరుణంలో కర్ణాటకకు చెందిన సీనియర్ రాజకీయవేత్త బసవరాజ హొరట్టి ఏకంగా ఏడు సార్లు ఆ సభకు ఎన్నికయ్యారు. వెరసి ఆయన గిన్నిస్ రికార్డులకెక్కారు. మొన్నటిదాకా ఆరు పర్యాయాలు కర్ణాటక శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన ఆయన వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. తాజాగా మొన్న జరిగిన ఆ రాష్ట్ర మండలి ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. కర్ణాటకలోని పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. 1980లో తొలిసారిగా ఇదే నియోజకవర్గం నుంచి రాజకీయ తెరంగేట్రం చేసిన ఆయన విజయ బావుటా ఎగురవేశారు. ఆ తర్వాత అదే నియోజకర్గం నుంచి పోటీ చేస్తూ వచ్చిన బసవరాజ... 1986, 1992, 1998, 2004, 2010లోనూ పెద్దల సభకు ఎన్నికయ్యారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై గిన్నిస్ రికార్డు పుటలకెక్కారు.