: కోచ్ రేసులో కుంబ్లే కూడా!... 57 దరఖాస్తుదారుల్లో స్పిన్ దిగ్గజం కూడా ఉన్నాడట!
టీమిండియా కోచ్ పదవి కోసం బీసీసీఐకి చేరిన దరఖాస్తుల్లో టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే దరఖాస్తు కూడా ఉందట. ఈ నెల 10తో ముగిసిన గడువు నాటికి బీసీసీఐకి మొత్తం 57 దరఖాస్తులు అందాయి. వీటిలో టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్, మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ తదితరుల అప్లికేషన్లు ఉన్నాయని తెలిసిందే. తాజాగా ఈ అప్లికేషన్లలో అనిల్ కుంబ్లే దరఖాస్తు కూడా ఉందని నిన్న బీసీసీఐ ప్రకటించింది. టెస్టుల్లో 619 వికెట్లు కూల్చిన కుంబ్లే... 2008లో జెంటిల్మన్ గేమ్ కు గుడ్ బై చెప్పాడు. ఐపీఓల్ లో తన సొంత రాష్ట్రం నుంచి ప్రమోట్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మొన్నటిదాకా మెంటార్ గా వ్యవహరించిన కుంబ్లే... ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.