: మాల్యా విల్లా రాజ ప్రాసాదమేనట!... మస్తుగా మజా చేసుకున్నానంటున్న గేల్!
విలాసాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారమంతా హైఫైగానే సాగుతోంది. మొన్నటిదాకా మధ్యం తయారీతో పాటు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరిట వ్యాపారాలు చేసిన మాల్యా... 17 బ్యాంకుల నుంచి తీసుకున్న వేలాది కోట్ల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయారు. అయితే అంతకుముందు ఆయన కట్టుకున్న విలాసవంత భవనాలు మళ్లీ వార్తలకెక్కాయి. ఇందుకు కారణం... ఆయన ప్రమోట్ చేసిన ఐపీఎల్ జట్టు ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ ఆటగాడు, వెస్టిండీస్ పించ్ హిట్టర్ క్రిస్ గేల్ కావడం గమనార్హం. క్రికెట్ తో పాటు పార్టీలంటే అమితాసక్తి చూపే గేల్... ఇప్పటిదాకా తన అనుభవాలను క్రోడీకరిస్తూ ‘సిక్స్ మెషీన్: ఐ డోన్ట్ లవ్ క్రికెట్, ఐ లవ్ ఇట్’ పేరిట రాసుకున్న ఆటో బయోగ్రఫీలో... గోవాలోని మాల్యా విల్లాను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. స్టార్ హోటళ్ల కంటే పెద్దదిగా ఉన్న మాల్యా విల్లా నిజంగా ఓ రాజప్రాసాదమేనని అతడు రాసుకున్నాడు. ఐపీఎల్ లో కాస్తంత విశ్రాంతి చిక్కిన సందర్భంగా బెంగళూరులో గోవా ఫ్లైటెక్కిన తాను మాల్యా విల్లాలో ఐదు రోజుల పాటు ‘రాజు’లా ఎంజాయ్ చేశానని అతడు చెప్పుకొచ్చాడు. గేల్ పుస్తకంలోని వివరాల్లోకెళితే... మొన్నటి ఐపీఎల్ సీజన్ లో జట్టు మేనేజర్ జార్జ్ అవినాశ్ సదరు విల్లా గురించి గొప్పగా చెప్పడం గేల్ చెవిన పడిందట. దీంతో అక్కడికి వెళ్లి తీరాల్సిందేనని నిర్ణయించుకున్న గేల్... ‘రాయల్స్’ ఆటగాళ్లను పిలిచాడట. అయితే ఏ ఒక్కరూ గోవాకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోయినా... గేల్ ఒంటరిగా అక్కడికి వెళ్లాడు. విల్లా వైశాల్యాన్ని చూసి గేల్ నోరెళ్లబెట్టాడు. చాలా హోటళ్ల కంటే కూడా ఆ విల్లా పెద్దగా ఉందట. అంతేకాకుండా అక్కడ ఉన్నంత చల్లదనాన్ని అతడు ఎక్కడా చూడలేదట. ఎంత వద్దనుకున్నా విల్లా మొత్తాన్ని తేరిపార చూడకుండా గేల్ ఉండలేకపోయాడు. ఇక లోపల అంతా రాచ మర్యాదలేనట. ‘‘విల్లా మొత్తం నాదే. ఇద్దరు బట్లర్లు నాతోనే ఉండేవారు. నాకు నేనే రాజులా ఫీలయ్యాను. అక్కడున్న స్విమ్మింగ్ పూల్స్ లో బీరు సేవిస్తూ విలాసంగా గడిపాను’’ అని గేల్ రాసుకున్నాడు. మాల్యా విల్లాను ‘జేమ్స్ బాండ్, ప్లేబాయ్ మాన్షన్’గా గేల్ అభివర్ణించాడు. ఇక విల్లాలోని గ్యారేజీలో ఉన్న పలు రకాల కార్లను ఆసక్తిగా తిలకించిన గేల్... వాటిలోని ఓ మూడు చక్రాల హార్లే డేవిడ్ సన్ బైకు గురించి కూడా ప్రత్యేకంగా రాశాడు.