: జగన్ ఇలాకాలో బైరెడ్డికి చేదు అనుభవం!... రుణమాఫీ కాలేదన్న ‘సీమ’ నేతపై కోడిగుడ్లతో దాడి!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందుల పర్యటనకు వెళ్లిన రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డికి నిన్న చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు టీడీపీ సర్కారు రైతుల రుణాలను, డ్వాక్రా రుణాలను ఎక్కడ కూడా మాఫీ చేయలేదన్న బైరెడ్డిపై జనం కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో షాక్ కు గురైన బైరెడ్డి అర్థాంతరంగా తన పర్యటనను ముగించుకోవాల్సి వచ్చింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పార్నపల్లెలో పర్యటించిన సందర్భంగా బైరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తొలుత లింగాల మండల కేంద్రంలో మాట్లాడిన ఆయన ‘రాయలసీమ ప్రజల గొంతు కోసి ఆంధ్రాలో అమరావతి పేరుతో రాజధాని నిర్మిస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో టీడీపీ హామీలు గుప్పించింది. ఇప్పటివరకు రుణాల మాఫీ, జాబులు, నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలా ఎక్కడా కనిపించలేదు’’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పార్నపల్లె వెళ్లిన బైరెడ్డి లింగాలలో చేసిన ప్రసంగాన్నే వల్లె వేశారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామ యువకులు ‘రుణాలు ఎక్కడ మాఫీ కాలేదో చెప్పండి’’ అంటూ బైరెడ్డిని నిలదీశారు. అంతేకాక అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన బైరెడ్డి వెనుదిరిగారు.