: సచ్ఛీలురకే ఏపీపీఎస్సీలోకి ఎంట్రీ!... దరఖాస్తులపై ఇంటెలిజెన్స్ తో ఆరా తీయిస్తున్న చంద్రబాబు!


నవ్యాంధ్రప్రదేశ్ లో సర్కారీ ఉద్యోగాల భర్తీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాల భర్తీ నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఏపీపీఎస్సీ కూడా సమాయత్తమవుతోంది. అయితే చైర్మన్ సహా 9 మంది సభ్యులు ఉండాల్సిన సర్వీస్ కమిషన్ లో... ప్రస్తుతం చైర్మన్ సహా ఒకే ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. దీంతో మిగిలిన 8 మంది సభ్యులను ఎంపిక చేసే విషయంపై సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. ఈ పోస్టుల్లో తమకు అవకాశం కల్పించాలంటూ ఇప్పటికే పలువురు పార్టీ నేతలు, పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చంద్రబాబుకు తమ బయోడేటాలను సమర్పించారు. మొన్నటిదాకా వీటిని పక్కనపెట్టిన చంద్రబాబు... ఇటీవలే వాటి బూజు దులిపారు. గతంలో కమిషన్ లో సభ్యులుగా ఎంపికై... ఉద్యోగ నియామకాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ వైనాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు... నవ్యాంధ్రలో చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఇలాంటి అక్రమార్కులకు చోటివ్వరాదని గట్టిగా నిర్ణయించుకున్నారు. తనకు అందిన దరఖాస్తులను ఇంటెలిజెన్స్ విభాగానికి అందజేసిన చంద్రబాబు... ఆశావహులపై సమగ్ర విచారణను గుట్టుగా జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఎపీపీఎస్సీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమార్కులకు చోటివ్వరాదన్న తలంపుతోనే చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిపోయిన ఇంటెలిజెన్స్ అధికారులు ఆయా వ్యక్తుల గుణగణాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News