: ఆరో రోజుకు ముద్రగడ దీక్ష.. నీళ్లే ఆహారంగా దీక్ష కొనసాగిస్తున్న కాపు నేత
కాపులకు రిజర్వేషన్లే లక్ష్యంగా పోరు బాట పట్టిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం గంట గంటకూ క్షీణిస్తోంది. తుని విధ్వంసం పేరిట అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయడంతో పాటు కాపులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆరు రోజుల క్రితం ముద్రగడ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంతింటిలో ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే నాటకీయ పరిణామాల మధ్య ముద్రగడ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల చర్యను తీవ్రంగా పరిగణించిన ముద్రగడ... ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. కేవలం నీరు మినహా ఆయన ఏమీ ముట్టడం లేదు. దీంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. నిన్న ముద్రగడకు పరీక్షలు చేసిన వైద్యులు... ఇకపై దీక్ష కొనసాగితే ముద్రగడ ఆరోగ్యం మరింత విషమ పరిస్థితికి చేరుకుంటుందని హెచ్చరించారు. అయినా దీక్ష విరమణకు ముద్రగడ ఒప్పుకోవడం లేదు. దీంతో అభిమానులు, కాపుల్లో ఆందోళన మొదలైంది.