: ఒకప్పుడు వంగవీటి రంగాను కోల్పోయాం... ఇప్పుడు ముద్రగడను పోగొట్టుకోలేం!: దాసరి


సామాజిక సమస్యను ఉగ్రవాద సమస్యగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తోందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు విమర్శించారు. హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్ లో కాపు నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో కాపు నేత వంగవీటి మోహన రంగాను పోగొట్టుకున్నామని, ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేమని అన్నారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చేర్చిన ముద్రగడ దగ్గరకు ఎవరినీ అనుమతించకపోవడం దారుణమని అన్నారు. కనీసం ఆయనతో ఫోన్ లో మాట్లాడుదామన్నా జామర్లు ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనం ఏపీలో ఉన్నామా? పాకిస్తాన్‌ లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని ఆయన మండిపడ్డారు. ముద్రగడ చర్చలకు సిద్ధమనడంతో ప్రభుత్వం తక్షణం స్పందించి, సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ముద్రగడ వెనుక తామున్నామని, కాపులకు అండగా నిలబడతామని చెప్పడానికే తాము ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ముద్రగడను, ఉద్యమాన్ని సమర్థించే వాళ్లపై బురద చల్లాలనే ఉద్దేశంతో, కాపు నేతలతో విమర్శలు చేయిస్తున్నారని, అది సరికాదని ఆయన హెచ్చరించారు. అలాంటి కుట్రలకు పాల్పడితే తాము కూడా తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News