: అమెరికన్లకు అండగా ఉంటాం: ప్రణబ్
అమెరికాలోని ఓర్లాండోలోని పల్స్ గే నైట్ క్లబ్ లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సందేశం పంపారు. ఇందులో... అమెరికాలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దారుణమని అభిప్రాయపడిన ఆయన, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఓర్లాండో ఘటన గుర్తు చేసిందని ఆయన భవిష్యత్ నిర్దేశం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికన్లకు భారత్ అండగా నిలుస్తుందని ఆయన ధైర్యం చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ దానిని భారత్ ఖండిస్తుందని...ఉగ్రదాడులు అర్థం లేనివని ఆయన ఈ సందేశంలో పేర్కొన్నారు.