: నీటిపై తేలియాడే వంతెన నిర్మించిన 80 ఏళ్ల బల్గేరియన్
కలలు కనాలంటే ఓ పది నిమిషాలు ఊహల్లో తేలియాడితే సరిపోతుంది. కానీ కన్న కలల్ని నిజం చేసుకోవాలంటే మాత్రం అద్భుతమైన ఆలోచన, దానిని సాకారం చేసుకునే పరిశ్రమ చేయాలి. అలా చేస్తే అద్భుతాలు సాధించవచ్చు. బల్గేరియాకు చెందిన ఎనభై ఏళ్ల క్రిస్టో వ్లాదిమిరోవ్ జావచెఫ్ అనే వ్యక్తి సరికొత్త ఆలోచన, పరిశ్రమతో ఇటలీలో రెండు ద్వీపాల మధ్య దూరాన్ని, ప్రయాణ విధానాన్ని మార్చేశాడు. వివరాల్లోకి వెళ్తే... ఇటలీలోని లాంబర్డేకు సమీపంలో లేక్ ఐసోలో మోన్టేఐసోలో అనే ద్వీపం ఉంది. ఇందులో 2 వేల మంది జనాభా ఉంటారు. ఈ ద్వీపం నుంచి లాంబర్డేకి రావాలంటే పడవల్లో మాత్రమే చేరుకోవాలి. ఇలా చేరుకునేందుకు చాలా సమయం పడుతోంది. అలా కాకుండా నీటిపై నడుస్తూ ఈ రెండు ద్వీపాల మధ్య దూరం తగ్గిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు క్రిస్టో రూపకల్పన చేశాడు. నీటిలోనే రహదారిని నిర్మిస్తే బాగుంటుందని భావించాడు. దీంతో గత ఏడాది ‘ది ఫ్లోటింగ్ పియర్స్’ అనే వినూత్న ప్రాజెక్టు చేపట్టాడు. సుమారు రెండు లక్షల 20వేల పాలీఇథిలీన్ క్యూబ్స్ ఉపయోగించి తన కలలకు రూపం తెచ్చాడు. ఈ క్యూబ్స్ అన్నింటినీ ఒకదానికొకటి అనుసంధానిస్తూ ఒక ఫ్లోర్ లా 3 కి.మీ.ల రహదారిని సముద్రంపై నిర్మించాడు. దీనిని రూపొందించేందుకు 110 కోట్ల రూపాయలు ఖర్చు కాగా, ఈ మొత్తాన్ని క్రిస్టో ఒక్కడే భరించడం విశేషం. అయితే ఇది గాలి వెలుతురు తట్టుకునేలా దీనిని ఎల్లో ఫ్యాబ్రిక్ తో కప్పే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ఈ నెల 18 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అంటే 16 రోజుల పాటు దీనిపై నడిచేందుకు ప్రజలను అనుమతిస్తారు. దీనిమీద నడిచేందుకు సుమారు 5 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని భావించిన క్రిస్టో...150 మంది వలంటీర్లు, లైఫ్ గార్డ్స్ తో సన్నాహాలు చేపట్టారు.