: ప్రజా వ్యతిరేకపనులు చేస్తే మోదీ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు: 'లెఫ్టినెంట్ గవర్నర్'కు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పని చేస్తున్నారంటూ ఆరోపిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన పలు విమర్శలు గుప్పించారు. వాటి వివరాల్లోకి వెళ్తే... రాష్ట్రంలో బీజేపీకి మద్దతు పలుకుతూ ప్రజావ్యతిరేక పనులు చేయడాన్ని కొలమానంగా తీసుకుని మోదీ మిమ్మల్ని దేశ ఉపరాష్ట్రపతిని చెయ్యరని తెలిపారు. ఆప్ చేపట్టిన ప్రతి విషయంలోను కలుగజేసుకుని కేంద్రం అడ్డుతగులుతోందని ఆయన మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వంద సీట్ల మెడికల్ కాలేజీని ప్రారంభించిందని చెప్పిన ఆయన, దానిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చెయ్యమని బీజేపీకి కొమ్ముకాసే ఏసీబీ టీంతో చెప్పండని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఇంటిపై దాడులు కూడా చేయాలని ప్రధాని మోదీతో చెప్పి, ఆదేశాలు జారీ చేయించండని గవర్నర్ కు రాసిన లేఖలో కేజ్రీవాల్ వ్యంగ్యం ప్రదర్శించారు.