: ప్రధాని మోదీ వద్ద స్వయంగా లాబీయింగ్ చేస్తున్న అమేజాన్ సీఈఓ జెఫ్ బెజోస్!


విదేశీ పెట్టుబడులతో ఇండియాలో నడుస్తున్న ఈ-కామర్స్ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని, ఆ కంపెనీల లావాదేవీలను పన్నుల పరిధిలోకి తేవాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్న వేళ, పరిస్థితి తమకు వ్యతిరేకంగా మారకుండా ఉండేలా చూసుకునేందుకు అమేజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సంవత్సరం మార్చిలో వచ్చిన ప్రతిపాదనల మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో నడిచే ఈ కామర్స్ కంపెనీలు కేవలం వ్యాపారులకు మార్కెట్ ప్లేస్ గా మాత్రమే వ్యవహరించాల్సి వుంది. ఈ నిర్ణయం అమలైతే, భారీగా నష్టపోయే మొదటి సంస్థ అమేజానే! మార్కెట్ ప్లేస్ గా మాత్రమే ఉంటే, థర్డ్ పార్టీ వెండార్లు, కొనుగోలుదారుల మధ్య మధ్యవర్తిగా మాత్రమే ఉండే వీలు కలుగుతుంది. అంటే, వ్యాపారులు ఇచ్చే కమిషన్ పై మాత్రమే ఆధారపడి లాభాలను పొందే అవకాశం లభిస్తుంది. ఇతర ఆదాయ మార్గాలుండవు. ఈ ప్రతిపాదనలు అమలైతే, నష్టపోతామని భావిస్తున్న జెఫ్, ఇప్పుడు స్వయంగా భారత ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, ఇండియాలో మరో 3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 20 వేల కోట్లు) పెట్టుబడులుగా పెడతామని హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలన్నది జెఫ్ కోరిక కాగా, ప్రధాని కార్యాలయం ఈ విషయమై ఇంకా స్పందించలేదు. యాపిల్ సంస్థ తన స్టోర్లను ప్రారంభించుకునేందుకు లోకల్ నిబంధనను (ఏదైనా విదేశీ సంస్థ ఇక్కడ సొంత స్టోర్ పెట్టాలంటే, కనీసం 30 శాతం విడిభాగాలు ఇండియాలోనే తయారు కావాలి) సడలించిన విషయాన్ని జెఫ్ గుర్తు చేస్తున్నారు. ఇండియాలో సంస్కరణలు శరవేగంగా అమలవుతున్న వేళ, అమేజాన్ వంటి సంస్థలకూ సహకరించాలని ఆయన కోరినట్టు సమాచారం. తమ వ్యాపార విధానం లక్షలాది మంది చిన్న చిన్న ఔత్సాహికులకు, వ్యాపారవేత్తలకూ మరింత లబ్ధిని చేకూరుతుందన్నది జెఫ్ వాదన.

  • Loading...

More Telugu News