: నమ్ముకున్న ఇన్వెస్టర్లకు ఐదేళ్లలో 800 శాతం రాబడిని అందించిన ఏకైక భారత కంపెనీ పీవీఆర్!


పీవీఆర్... ఇండియాలోని వివిధ నగరాలు, పట్టణాల్లో మల్టీ ప్లెక్స్ లను నిర్వహిస్తున్న సంస్థ. సరిగ్గా ఐదేళ్ల క్రితం పీవీఆర్ ఈక్విటీ విలువ రూ. 100కు అటూఇటుగా ఉండేది. ఇప్పుడు ఆ సంస్థ వాటా విలువ రూ. 930. అంటే ఐదేళ్ల క్రితం ఓ 1000 పెట్టి పది వాటాలను కొనుగోలు చేసిన వారు, వాటిని ఇప్పుడు అమ్ముకుంటే రూ. 9,300 వరకూ వస్తాయి. ఈ ఐదేళ్లలో సెన్సెక్స్ నమోదు చేసిన వృద్ధి 46 శాతం అయితే, పీవీఆర్ 800 శాతానికి పైగా పెరిగింది. ఈ సంస్థ వాటా అతి త్వరలో రూ. 1000ను తాకుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం ఆరంభం నుంచి పరిశీలిస్తే, స్టాక్ మార్కెట్ 2 శాతం మాత్రమే పెరుగగా, పీవీఆర్ ఈక్విటీ ఏకంగా 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లు, రూ. 200 కోట్లు కలెక్షన్లను వసూలు చేస్తున్న సినిమాలు పెరగడం, మల్టీ ప్లెక్స్ సంస్కృతి విస్తరిస్తున్న తీరు పీవీఆర్ కు అనుకూలాంశాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం 200 నుంచి 250 స్క్రీన్లను కొత్తగా తమ పరిధిలో కలుపుకుంటూ వెళతామని పీవీఆర్ చెబుతోంది. ఇప్పటికే మరో 500 స్క్రీన్లను టేకోవర్ చేసే దిశగా డీల్స్ కుదుర్చుకున్న సంస్థ, సొంతంగా 100 స్క్రీన్లను నిర్మిస్తోంది. పీవీఆర్ కు పోటీగా ఉన్న ఐనాక్స్ సంస్థ గత సంవత్సరంతో పోలిస్తే 2 శాతం ఆదాయ నష్టాన్ని నమోదు చేసిన వేళ, పీవీఆర్ ఏకంగా 19.3 శాతం వృద్ధిని సాధించి చూపింది. ఈ సంవత్సరం రిలీజ్ కానున్న సుల్తాన్, మొహంజోదారో, దంగల్ వంటి చిత్రాలు విజయవంతమైతే, పీవీఆర్ విలువ మరింతగా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్ల వ్యవధిలో ఇన్వెస్టర్లకు ఇంతటి లాభాలను మరే సంస్థా అందించలేకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News