: ప్రపంచ మార్కెట్లన్నీ పతనం... ఆమ్మకాల వెల్లువలో సెన్సెక్స్, నిఫ్టీ
అమెరికాపై జరిగిన ఉగ్రదాడి ప్రపంచ మార్కెట్లను వణికించింది. ఈ ఉదయం ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు 1 నుంచి 3 శాతం వరకూ పతనం కాగా, అదే దారిలో భారత బెంచ్ మార్క్ సూచికలు సెన్సెక్స్, నిఫ్టీలు పయనించాయి. సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్ల మేరకు, నిఫ్టీ 80 పాయింట్ల మేరకు నష్టపోయాయి. ఉగ్రదాడికి తోడు యూఎస్ ఫెడరల్ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలు, ముడి చమురు ధరలు పెరుగుతుండటం కూడా ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పడిపోయేందుకు సహకరించాయని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. ఆసియా మార్కెట్లలో నిక్కీ 225 సూచిక 3.63 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 1.6 శాతం, హాంగ్ సెంగ్ 2.68 శాతం, తైవాన్ వెయిటెడ్ 2.10 శాతం, కోస్పీ 1.95 శాతం, జకార్తా కాంపోజిట్ 0.63 శాతం, షాంగై కాంపోజిట్ 3.34 శాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్ల ఆరంభంలోనే అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుండగా, ఎఫ్టీఎస్ఈ 100 సూచిక 0.25 శాతం, సీఏసీ 40 ఒక శాతం, డీఏఎక్స్ 1.24 శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. యూఎస్ మార్కెట్లో డౌ జోన్ ఫ్యూచర్స్ 0.38 శాతం, ఎస్అండ్ పీ 500 ఫ్యూచర్స్ 0.43 శాతం నష్టాన్ని సూచిస్తున్నాయి. భారత మార్కెట్ విషయానికి వస్తే, మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచి క్రితం ముగింపుతో పోలిస్తే 273 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్ల పతనంలో సాగుతున్నాయి. నిఫ్టీ 50లో 13 కంపెనీల ఈక్విటీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లు అర శాతానికి పైగా దిగజారాయి. భారత మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అధిక అమ్మకాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.