: వియన్నా భేటీలో భారత్ దరఖాస్తుపై చర్చ జరగలేదు: చైనా సంచలన ప్రకటన
అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నెల 9న వియన్నాలో జరిగిన కూటమి భేటీలో భారత దరఖాస్తుపై చైనా వైఖరికి సంబంధించి భిన్న కథనాలు వెలువడుతున్నాయి. కూటమిలో భారత సభ్యత్వంపై వియన్నా భేటీలో నిరసన గళం వినిపించిన చైనా... ఆ తర్వాత తన వైఖరి మార్చుకుని మరింత మేర చర్చలు జరగాలని కోరిందని ఓ కథనం వెలువడింది. దాని వెంటే వియన్నా భేటీలో భారత దరఖాస్తుపై అసలు చర్చే జరగలేదని చైనా వ్యాఖ్యానించినట్లు మరో కథనం వచ్చింది. తాజా కథనంలో భారత దరఖాస్తుపై అసలు చర్చే జరగకుండా తానెలా అభ్యంతరం వ్యక్తం చేస్తానని చైనా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. వియన్నాలో జరిగిన భేటీలో భారత్ సహా ఏ ఒక్క దేశానికి కూటమిలో సభ్యత్వంపై చర్చ జరగలేదని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. భేటీలో భారత్ సభ్యత్వంపై చర్చ జరిగిందంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ఆ దేశం పేర్కొంది. అర్జెంటీనా రాయబారి అధ్యక్షతన జరిగిన సదరు భేటీకి అసలు ఎజెండానే లేదని కూడా చైనా సంచలన వ్యాఖ్య చేసింది. త్వరలో సీయోల్ లో జరగనున్న భేటీకి సంబంధించిన నివేదికల కోసమే సదరు భేటీ జరిగిందని కూడా చైనా చెప్పింది.