: 'ది యాక్సిడెంటల్ పీఎం'... తెరకెక్కనున్న మన్మోహన్ సింగ్ జీవిత గాధ
ఎవరైనా రాజకీయ నాయకుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే, అందుకు ఎన్నో ఏళ్ల నిరీక్షణ, అంతకుమించిన శ్రమ పడాల్సి వుంటుంది. అదృష్టమూ కలిసి రావాలి. ప్రత్యర్థులను నీళ్లు తాగించగల రాజకీయ చతురత ఉండాలి. తన దారిలో మరెవరూ అడ్డురాకుండా, ఇదే సమయంలో ప్రజలు ఓట్లు కురిపించేలా చేయగలిగే వాక్చాతుర్యం ఉండాలి. ఇవేమీ పెద్దగా లేని వ్యక్తికి పదవి దక్కితే, అది కచ్చితంగా అదృష్టమే. అదే పదవి ప్రధాని పదవైతే...? మన్మోహన్ సింగ్ విషయంలో అదే జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా సేవలందించే అవకాశం అనుకోకుండా లభించింది. ఇక మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర, ఆయనకు ప్రధాని పదవి ఎలా లభించిందన్న విషయాలపై సంజయ్ బారూ రాసిన వివాదాస్పద పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్' ఆధారంగా ఓ హిందీ చిత్రం తెరకు ఎక్కుతోంది. ఈ చిత్రం టీజర్ ను ఆగస్టు 30న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ వర్గాలు వెల్లడించాయి. సునీల్ బోహ్రా నిర్మిస్తున్న ఈ చిత్రం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియలు హైదరాబాద్ లో జరిగిన వివాదాస్పద తీరుతో మొదలవుతుందని సమాచారం. పంజాబ్ కు చెందిన ఓ యువనటుడు మన్మోహన్ గా నటిస్తున్న చిత్రంలో కీలకమైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వంటి వారి పాత్రలకు సరైన నటీనటుల కోసం ఇంకా అన్వేషణ సాగుతోందని తెలుస్తోంది. అందుబాటులోని సమాచారం ప్రకారం, పుస్తక రచయిత, 2004 నుంచి 2008 వరకూ మన్మోహన్ సలహాదారుగా ఉన్న సంజయ్ బారూ పాత్రను సినిమాలో మనోజ్ బాజ్ పాయ్ పోషించనున్నాడని తెలుస్తోంది.