: యూపీ సీఎం అభ్యర్థిగా రాజ్ నాథే... అలహాబాదు బీజేపీ భేటీలో అందరిదీ అదే మాట!


దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సత్తా ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను కేంద్రంలోని అధికార బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలోని అలహాబాదులో నిన్న బీజేపీ సమావేశం జరిగింది. నేడు కూడా జరగనున్న ఈ సమావేశంలో బీజేపీ తన సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తుందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. రేసులో గాంధీ కుటుంబానికి చెందిన సుల్తాన్ పూర్ ఎంపీ వరుణ్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్లు వినిపిస్తున్నా... యూపీ ఎన్నికలను గెలుచుకురాగల సత్తా వారికి లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి ఓ దఫా (2000-02) సీఎంగా పనిచేసిన పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను బరిలోకి దించాలని ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావించారు. వారిద్దరి ప్రతిపాదనను తిరస్కరించిన రాజ్ నాథ్... తాను కేంద్రంలోనే ఉంటానని చెప్పినట్లు సమాచారం. అయితే కీలకమైన రాష్ట్ర ఎన్నికల దృష్ట్యా రాజ్ నాథ్ బరిలోకి దిగితేనే ఫలితం ఉంటుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. తమ వాదనను అధినాయకత్వానికి తెలిపే క్రమంలో నిన్నటి సమావేశాల్లో వారు రాజ్ నాథ్ పేరుతో పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News