: హైదరాబాద్ రోడ్లపై కేటీఆర్... దీనావస్థ చూసి ఆగ్రహం!


హైదరాబాద్ నగరంలో రహదారుల దీనావస్థను ప్రత్యక్షంగా తిలకించిన కేటీఆర్, అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా భూగర్భ విద్యుత్ కేబుళ్ల నెపంతో రోడ్ల వెంట విచ్చలవిడిగా తవ్వకాలు జరుపగా, ఆపై కురిసిన వర్షాలకు కిలోమీటర్ల కొద్దీ రోడ్లు నరకాన్ని తలపించేలా పాడైపోయిన సంగతి తెలిసిందే. వివిధ చానళ్లలో రోడ్ల దుస్థితిపై కథనాలు రాగా, నిన్న అమెరికా పర్యటనను ముగించుకు వచ్చిన కేటీఆర్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్లను పరిశీలించారు. రోడ్డు వేసిన కాంట్రాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాణ్యత లేని రహదారుల వల్లే ఈ పరిస్థితి నెలకొందని, విద్యుత్ విభాగం, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లోపం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అసహనాన్ని వ్యక్తం చేశారు. మూడు నుంచి ఆరు అడుగుల లోతులో తవ్విన పొడవాటి గుంతలను చూసి, స్కూళ్లు తెరచిన వేళ, ఎవరైనా పిల్లలు అందులో పడిపోతే, ఎవరిది బాధ్యతంటూ అధికారులపై కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News