: 'వాడు వచ్చేస్తున్నాడు... నేను చచ్చిపోతున్నా'... నైట్ క్లబ్ లో యువకుడికి, అతని తల్లికీ మధ్య జరిగిన మనసును కదిలించే సంభాషణ!


మినా జస్టిస్... గాఢ నిద్రలో ఉన్న సమయంలో తన 30 ఏళ్ల కుమారుడు ఎడ్డీ జస్టిస్ నుంచి ఓ మెసేజ్ అందుకుంది. ఉగ్రవాది ఒమర్ మతీన్ నైట్ క్లబ్ పై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డ వేళ, అక్కడే చిక్కుకున్న ఎడ్డీ తన తల్లికి ఎన్నో టెక్ట్స్ మెసేజ్ లు పెట్టాడు. వాటికి స్పందిస్తూ, కొడుకు ప్రాణాలతో బయటపడాలని మినా ఎంతో తల్లడిల్లి పోయింది. మనసును కదిలించేలా ఉన్న వారి మధ్య జరిగిన టెక్ట్స్ మెసేజ్ ల సంభాషణ ఇది. "మమ్మీ ఐ లవ్ యూ" తొలి మెసేజ్ అర్ధరాత్రి 2:06కు వచ్చింది. ఆపై "క్లబ్ లో వారు కాల్పులు జరుపుతున్నారు" ఈ మేసేజ్ ని చూసిన మినా, తన కుమారుడికి కాల్ చేయాలని ప్రయత్నించింది. సమాధానం రాలేదు. నిద్రమత్తును వదిలించుకున్న ఆమె, "యూ ఓకే" అని అడిగింది. ఆపై 2:07 గంటల సమయంలో "బాత్ రూములో చిక్కుకున్నాను" అన్న సమాధానం వచ్చింది. "ఏ క్లబ్బులో..." అని అడిగితే, "పల్స్... డౌన్ టౌన్... పోలీసులకు కాల్ చెయ్యి" అన్న సమాధానం వచ్చింది. ఆపై నిమిషంలోనే "నేను చచ్చిపోతున్నా" అంటూ ఎడ్డీ మెసేజ్ పెట్టాడు. ఆపై నిమిషాల వ్యవధిలో ఆ తల్లి ఎన్నో మెసేజ్ లు పెట్టింది. "నేను పోలీసులకు కాల్ చేస్తున్నా", "నువ్వింకా అక్కడే ఉన్నావా?", "సమాధానం చెప్పవేం", "కాల్ మీ" అంటూ అడిగింది. సమాధానం లేకపోవడంతో 911కు కాల్ చేసింది. కాల్ రిసీవ్ చేసుకున్న అధికారి ఆమెను లైన్ లో ఉండమని చెప్పారు. తన కుమారుడు ఎలాంటి పరిస్థితిలో చిక్కుకున్నాడో తెలియని స్థితిలో ఉన్న ఆమెకు తన కుమారుడు గే అని, అతను గే క్లబ్బుకు వెళతాడని తెలుసు. మళ్లీ 2:39 గంటల సమయంలో మరో మెసేజ్ వచ్చింది. "పోలీసులకు కాల్ చెయ్యి అమ్మా... వెంటనే" అంటూ, ఆపై "వాడు వచ్చేస్తున్నాడు. నేను చచ్చిపోతాను" అంటూ ఎడ్డీ మెసేజ్ పెట్టాడు. "బాత్ రూములో ఉన్నవారిలో ఎవరైనా గాయపడ్డారా?" అన్న మినా ప్రశ్నకు "అవును, చాలా మంది" అన్న సమాధానం వచ్చింది. ఆపై ఇక అతని నుంచి చాలాసేపు సమాచారం రాలేదు. తల్లడిల్లిన మినా "టెక్ట్స్ మీ ప్లీజ్" అంటూ వేడుకుంది. కొద్దిసేపటి తరువాత మరో మెసేజ్... "ఇంకా బాత్ రూములోనే ఉన్నాను. అతను మాతోనే ఉన్నాడు. మమ్మల్ని బయటకు రమ్మంటున్నాడు" అని ఒకసారి, ఆపై "త్వరగా... వాడు మాతోనే బాత్ రూములో ఉన్నాడు. వాడో ఉగ్రవాది" అన్న మెసేజ్ వచ్చింది. అదే మినా తన కుమారుడు ఎడ్డీ నుంచి అందుకున్న ఆఖరి మెసేజ్. ఆపై 15 గంటలు గడిచినా ఎడ్డీ ఆచూకీ తెలియలేదు. ఆమెతో పాటు పదుల సంఖ్యలో కుటుంబసభ్యులు, స్నేహితులు ఎడ్డీ గురించిన ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎడ్డీ క్షేమంగా ఉన్నాడని తెలిస్తే చాలంటున్నారు. కాగా, మరణించిన వారిలో ఎడ్డీ ఉన్నాడా? లేదా? అన్నది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.

  • Loading...

More Telugu News