: కాపుల కోసం రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు పథకాలను ప్రవేశపెట్టిందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మాట్లాడుతూ, కాపు యువకుల కోసం 'విద్యోన్నతి' పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడి, సివిల్స్ వంటి ఉన్నతోద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువకులు లబ్ధి పొందుతారని ఆయన చెప్పారు. ఈ పధకం కింద ప్రతి ఏటా 500 మందికి ఉచిత శిక్షణ కల్పించనున్నామని ఆయన తెలిపారు. అయితే కాపు కార్పొరేషన్ వెబ్ సైట్ లో వారు రిజిస్టర్ అయి ఉండాలని ఆయన సూచించారు. 'విదేశీ విద్యా దీవెన' పేరిట మరో పథకాన్ని కూడా కాపు యువత కొసం అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు. విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లే 500 మంది విద్యార్థులకు సాయం అందజేయనున్నామని ఆయన తెలిపారు. ఈ రెండు పథకాలకు నేటి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు.