: రూ. 40 లక్షలు, టైటిల్స్ లో పేరు హామీతో ముగిసిన చిరంజీవి 'కత్తి' కథ వివాదం!
చిరంజీవి 150వ చిత్రం 'కత్తి' కథ తనదేనని, తనకు న్యాయం చేయాలని వివాదాన్ని తీసుకువచ్చిన రచయిత ఎన్.నరసింహారావుతో నిర్మాతల సంప్రదింపులు ఫలించాయి. ఆయనకు రూ. 40 లక్షలు పారితోషికం ఇవ్వడంతో పాటు, టైటిల్స్ లో ఆయన పేరు వేసేందుకు హామీ ఇవ్వడంతో ఈ వివాదం ముగిసినట్టేనని నరసింహారావు ప్రకటించారు. అంతకుముందు సినిమా కథ తనదేనని, దాన్ని తెలుగు రచయితల సంఘంలో రిజిస్టర్ కూడా చేయించానని ఆయన ఆధారాలు చూపగా, దర్శకరత్న దాసరి నారాయణరావు తదితరులు, ఆధారాలు నిజమేనని, ఆయనకు న్యాయం జరిగేంత వరకూ కత్తి షూటింగ్ కు వెళ్లవద్దని సినీ కార్మికులకు సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న తరుణాన ఇబ్బందులను దూరం చేసుకునేందుకు నరసింహారావుతో సంప్రదింపులు జరిపిన మెగా టీం సమస్యను ఓ కొలిక్కి తేవడంలో విజయం సాధించింది.