: తిరుమల, యాదాద్రి, బాసర... అంతటా ఒకే పరిస్థితి... పోటెత్తిన భక్తులు!
వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల, యాదగిరిగుట్ట, బాసర వంటి పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి అత్యధికంగా ఉంది. కొత్తగా స్కూళ్లలో చేరే విద్యార్థులకు అక్షరాభ్యాసం కోసం భారీ ఎత్తున తల్లిదండ్రులు తమ పిల్లల్తో కలిసి బాసరకు వచ్చారు. ఇక్కడ అక్షరాభ్యాసం కోసం మూడు నుంచి నాలుగు గంటల పాటు వేచి వుండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక యాదాద్రి విషయానికి వస్తే, లక్ష్మీ నరసింహుని దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వాహనాల రాకపోకలను సైతం నిలిపివేశారు. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. తిరుమలలో అన్ని కంపార్టుమెంట్లూ నిండి, భక్తుల క్యూ లైన్ నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటైన తాత్కాలిక షెడ్ల వరకూ విస్తరించింది. ఈ సమయంలో ఉచిత దర్శనానికి వెళ్లే వారికి 12 గంటల తరువాతే దర్శనం లభిస్తుందని టీటీడీ ప్రకటించింది. క్యూలైన్లలోని భక్తులకు అన్న పానీయాలను సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు.